31, జనవరి 2011, సోమవారం

CPU ముందు భాగం...

CPU ని విశదీకరిస్తే సెంట్రల్ ప్రోసెసింగ్ యూనిట్ (Central Processing Unit). అనగా కేంద్రీయ నియంత్రణ విభాగము. ఇంకా తేలిక భాషలో చెప్పాలంటే ఒకే చోట ఉండి అన్నిటిని శాసించగల మహారాజు అన్న మాట. CPU లోపల ఏమి దాగి ఉందో తెలుసుకోవటానికి ముందు దాని బాహ్య స్వరూపాన్ని గురించి మరింత విపులంగా తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ CPUలు రెండు ఆకారాలలో తయారవుతున్నాయి. అవి ఎలా ఉన్నాయో చూద్దాం. 

http://i54.tinypic.com/30mr12r.jpghttp://i53.tinypic.com/334hunc.jpg 
మొదటి రకం CPU ని Tower టైపు CPU అంటారు. ఎందుకంటే ఇది గోపురం లాగా నిలువుగా ఉంటుంది ఉంటుంది కాబట్టి. రెండవ రకం CPU ని Flat టైపు CPU అంటారు, ఎందుకంటే ఇది భూసమాంతరంగా ఉంటుంది కాబట్టి. సాధారణంగా మనం Tower టైపు CPU లను చూస్తుంటాము. ఏ రకమైన CPU కి అయినా సాధారణంగా బయటకు కనిపించే భాగాలను చూద్దాం. 

http://i56.tinypic.com/ja9mr4.jpg
ఇక్కడ మొదటిది Optical డ్రైవ్; అంటే మనం సినిమాలు చూడటానికి ఉపయోగించే CD/DVD లను పెట్టటానికి ఉపయోగిస్తాము. రెండవది Eject బటన్; అంటే ఆప్టికల్ డ్రైవ్ ని తెరవటానికి ఉపయోగపడే బటన్.
దీనిలో CD/DVD లను ఈ విధంగా పై వైపు గా పెడతారు. వెనుకకు తిప్పి మాత్రం పెట్టకండి. 
http://i56.tinypic.com/2iktgkz.jpg
ఈ CD/DVD డ్రైవ్ ని ఇంకా పరిశీలనగా గమనిస్తే చిన్న సూది బెజ్జమంత రంధ్రం కూడా కనిపిస్తుంది.CD/DVD,డ్రైవ్ లోపల ఇరుక్కుపోతే దానిని Eject(ఎజెక్ట్)చెయ్యటానికి (బయటకు తియ్యటానికి)ఈ రంధ్రం లో ఏదైనా సూదిని గుచ్చితే సరిపోతుంది. ఆ ఇరుక్కున్న CD/DVD తనంతట తానే బయటకు వస్తుంది.
http://i52.tinypic.com/xby0lt.jpg
 http://i51.tinypic.com/9ieqgp.jpg


ఇక పోతే మొదటి పటంలో మూడవ భాగం అదనపు CD/DVD డ్రైవ్ ని పెట్టుకోవటానికి ఏర్పాటు చేసిన ఖాళీ ప్రదేశం. నాల్గవ భాగం Floppy (ఫ్లాపీ) డ్రైవ్. ఈ CD/DVD లు రాక పూర్వం పాటలు పద్యాలు లాంటి ఏ సమాచారాన్నైనా భద్రపరచటానికి వాటిని ఉపయోగించే వారు. ఈ ఫ్లాపీ డ్రైవ్ ముందు వెనుక భాగాలు ఈ క్రింద చూపించిన విధంగా ఉంటాయి. 
http://i52.tinypic.com/34r9ggk.jpghttp://i56.tinypic.com/2heh8na.jpg 
 మొదటి పటంలో చివరి భాగం ఈ ఫ్లాపీ డ్రైవ్ Eject బటన్. ఫ్లాపీని ఈ విధంగా ముందు భాగం పైకి ఉండే విధంగా డ్రైవ్ లో ఉంచాలి.

http://i51.tinypic.com/sfzcas.png
CPU ముందు భాగంలో ఇంకా క్రిందకు వచ్చినట్లయితే ఈ విధంగా ఉంటుంది.

http://i54.tinypic.com/20ij1xu.jpg
CPU ని ON చెయ్యటానికి పైనున్న POWER బటన్ ని ఉపయోగిస్తారు. కొన్ని సందర్భాలలో CPU నిస్తేజమైనప్పుడు (HANG); పవర్ OFF చేసి మరలా ON చేస్తే సరిగా పని చేస్తుంది. అలాంటి సందర్భాలలో POWER
బటన్ రెండు సార్లు ఉపయోగించకుండా ఒక్క సారి నొక్కితేనే OFF మరియు ON అయ్యే విధంగా RESET బటన్ ని ఏర్పాటు చేసారు. ప్రస్తుతం వస్తున్న కొన్ని కంప్యూటర్లలో ఈ RESET బటన్ ఉండటం లేదు. అలాంటి సందర్భాలలో POWER బటన్ నే రెండు సార్లు ఉపయోగించాల్సి ఉంటుంది. సరిగా గమనించినట్లైతే POWER బటన్ కన్నా RESET బటన్ చిన్నదిగా ఉంటుంది. 

దాని క్రింద H.D.D. అని వ్రాసి ఉన్నది ఎర్ర రంగు LED లైటు. ఇది CPU లోపల HARD DISK వాడకంలో ఉన్నప్పుడు వెలుగుతుంది. CPU లోపల ఉండే ఈ హార్డ్ డిస్క్ గురించి వివరంగా ముందు ముందు తెలుసుకుందాం.
ఇంకా క్రింద కుడి వైపు ఎడమ వైపు ఒకేలాగా ఉన్న రెండు రంధ్రాలు ఉన్నాయి. వాటిని USB SLOTs అంటారు. అవి USB KEY లేక PEN DRIVE ని పెట్టేందుకు ఉపయోగిస్తారు.  ఈ PEN DRIVE లు కూడా CD, DVD లాగానే పాటలు సినిమాలు ఇతర సమాచారాన్ని నిల్వ చేసుకోవటానికి ఉపయోగిస్తారు. అవి ఈ క్రింద చూపించిన విధంగా ఉంటాయి. 
http://i56.tinypic.com/4qhczs.jpghttp://i54.tinypic.com/2qkii60.jpg 
చివరి రకం PEN DRIVE లను ఉపయోగించేటప్పుడు ఏ దిశలో పెడుతున్నమనేది గమనించాలి. మొత్తం మీద USB SLOT లో ఉన్న లోహపు గీతలు PEN DRIVE మీద ఉన్న లోహపు గీతలతో అనుసంధానంలోకి రావాలి. 

ఇక మధ్యలో ఉన్న ఎరుపు, ఆకు పచ్చ రంగు రంధ్రాలలో హెడ్ ఫోన్ పెట్టటానికి వాడతారు.
http://i53.tinypic.com/2dam8o1.jpg

 ఒక వేళ రంగులు మార్పుగా ఉన్నప్పటికీ CPU మీద ఉన్న చిహ్నాల ఆధారంగా HEADPHONE JACK (పిన్ను) మరియు MICROPHONE JACK లను ఎక్కడ ఉంచాలో గుర్తించవచ్చు. ఇలాంటివే మరొక రెండు కానీ మూడు కానీ CPU వెనుక భాగంలో కూడా ఉంటాయి. వాటి గురించి పూర్తి వివరాలు రేపు తెలుసుకుందాం...
ఇప్పుడు కొత్తగా వస్తున్న కంప్యూటర్లలో సెల్ ఫోన్ మరియు కెమెరాలలో ఉపయోగించే మెమరీ కార్డులను ఉపయోగించేందుకు కూడా స్థానం కల్పించబడింది.
http://i55.tinypic.com/jzk54y.jpg
ఇక్కడ పైన ఉన్న నాలుగు స్థానాలు వివిధ రకాలైన మెమరీ కార్డులను ఉంచేందుకుగాను ఇవ్వబడ్డాయి.
ఇక పోతే చివరిగా CPU ముందు భాగంలో ఉండే అన్ని భాగాల గురించి తెలుసుకున్నాం కానీ ఆయా కంపెనీలను బట్టి విడి భాగాల స్థానాలు మారే అవకాశం ఉంది. ఉదాహరణకు ఇది గమనించండి.
http://i56.tinypic.com/2q9i1cl.jpghttp://i56.tinypic.com/a3dxjs.jpg 

ఇక్కడ CD డ్రైవ్, PEN డ్రైవ్, HARD డ్రైవ్, FLOPPY డ్రైవ్, HEADPHONE జాక్, MICROPHONE జాక్, లాంటి అనేక ఆంగ్ల పదాలను నేరుగా ఉపయోగించటం జరిగింది. ఎందుకంటే వాటి సమానార్ధక తెలుగు పదాల కంటే అవే పదాలు ఎక్కువ వాడుకలో ఉన్నాయి. కాబట్టి తడబాటు చెందకుండా ఆయా పదాలను గుర్తు పెట్టుకుని, ఉపయోగించే ప్రయత్నం చెయ్యండి.

30, జనవరి 2011, ఆదివారం

ప్రాధమిక పరిజ్ఞానం - 1

    ఈ రోజు మనం డెస్క్ టాప్ కంప్యూటర్ గురించి తెలుసుకుందాం. దాని పేరునిబట్టి అది బల్ల మీద పెట్టుకునే కంప్యూటర్ అని అర్ధం అవుతుంది. దీనిని మనం ఇళ్ళలోనూ ఇంటర్నెట్ సెంటర్ లలోను చూడవచ్చు. వివిధ రకాల డెస్క్ టాప్ కంప్యూటర్లను మనం ఇప్పుడు చూద్దాం.



సరిగ్గా గమనించినట్లైతే ఇందులో నాలుగు ముఖ్యమైన భాగాలు కనిపిస్తాయి. అవి ఏమిటో చూద్దాం. ఇందులో మొదటగా మన కంటికి కనిపించేది, కొంచెం తెలిసినట్లు అనిపించేది (టీవీ లాగా కనిపిస్తున్న)మోనిటర్ (Monitor). తెలుగులో అయితే తెర అనుకోవచ్చు. కంప్యూటర్ అనే ఈ బ్రహ్మ పదార్ధం లోపల ఏమి జరుగుతుందనేది చూడటానికి మాత్రమే అది ఉపయోగ పడుతుంది. 

మరి కంప్యూటర్ కి టివి కి తేడా చూపించగల ముఖ్యమైన భాగం ఎక్కడ ఉంది? మొదటి బొమ్మలో ఎడమ ప్రక్కన, రెండవ బొమ్మలో కుడి ప్రక్కన ఉన్న డబ్బా లాంటి ఆకారమే ఆ ముఖ్యమైన భాగం. మాయల ఫకీరు ప్రాణం చిలకలో ఉన్నట్లు ఈ కంప్యూటర్ ప్రాణం అంతా ఆ డబ్బాలోనే ఉంటుంది. దానినే CPU అంటారు. మరి ఆ మూడవ బొమ్మలో ఆ డబ్బా ఏమైనట్లు? అలాంటి డెస్క్ టాప్ లు ఈ మధ్యనే కొత్తగా తాయారు చేస్తున్నారు. వాటిలో ఆ CPU అనే భాగం తెర (Monitor) వెనుక ఉండి అన్ని పనులను నడిపిస్తుంది. 

  ఇక మిగిలినవి పురాతన టైపు రైటర్ మీద ఉన్నట్లుగా అక్షరాలు ఉన్న ఒక చెక్క బల్లలాంటి వస్తువు; దానిని కీ బోర్డు అంటారు. కంప్యూటర్ కి నోరు చెవులు లేవు కాబట్టి దానికి అర్ధం అయ్యే లాగా చెప్పాలి అంటే ఈ కీ బోర్డు అవసరం అవుతుంది. మనం ఎలాగైతే మూగ, చెవిటి వారికి అర్ధం అవటానికి కాగితం మీద వ్రాసి చూపిస్తామో అలాగే కంప్యూటర్ కి అర్ధం అయ్యేలాగా చెప్పాలి అంటే కీ బోర్డు మీద టైపు చేసి చూపించాలి. మరి మనం మూగ చెవిటి వారితో మాట్లాడాలి అంటే సైగలు చేస్తాం కదా అని అడగవచ్చు. కను సైగలను కూడా అర్ధం చేసుకుని అడిగిన పనులను చేసే కంపూటర్లు చూసే రోజు ఎంతో దూరంలో లేదు. ఈ లోపుగా ప్రస్తుతం ఉన్న కంపూటర్ల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

  ఇక చివరగా మిగిలిన అతి చిన్న అర చేతిలో ఇమిడి పోయే వస్తువు Mouse (మౌస్). Mouse అంటే చుంచు ఎలుక అని అర్ధం. దాని ఆకారాన్ని బట్టి దానికి ఆ పేరు వచ్చింది. మనం అక్కడ ఉంది, ఇక్కడ ఉంది అని సైగలతో చెప్పగల్గిన విషయాలను ఈ Mouse ని అటు ఇటు కదిలించటం ద్వారా చూపించ వచ్చన్నమాట. అంతే కాకుండా ఈ మౌస్ తో ఇంకా కొన్ని ముఖ్యమైన పనులు కూడా చెయ్యవచ్చు.  ఆ విషయాలను గురించి కూలంకషంగా మనం త్వరలోనే తెలుసుకుందాం.

ఇక పోతే అతి ముఖ్యమైన భాగం అనుకున్న CPU మూసిన గుప్పెట్లో ఏమి దాచుకుంది? మనం చెప్పిన పనులన్నీ, అంతే కాక మనకు కష్టం ఐన పనులను కూడా అంతా సులువుగా చేయగల శక్తితో మనుషులను కూడా శాసించ గల శక్తి దానిలో ఎక్కడ నిక్షిప్తమై ఉంది అనే విషయాలను మనం రేపు తెలుసుకుందాం. అంత వరకు శలవు తీసుకుంటూ...

ముందు మాట

     ఈ రోజుల్లో ప్రతి ఇంట్లోను ఒక లాప్ టాప్ లేక పోతే కనీసం ఒక కంప్యూటర్ (డెస్క్ టాప్) ఉంటున్నాయి. అవి గాలి నీరు ఆహరం కన్నా అత్యవసరాలు నిత్యావసరాలు ఐ పొయ్యాయి. స్కూల్ కి వెళ్ళే ఒకటో తరగతి పిల్లవాడు కూడా ఈ రోజుల్లో కంప్యూటర్ గురించి మాట్లాడుతున్నాడు, దానిని ఉపయోగిస్తున్నాడు. కాని వాటిని ఉపయోగిస్తున్న ప్రస్తుత తరం కాకుండా అంతకు ఒక్క తరం ముందు వారికి మాత్రం అది ఒక అంతు చిక్కని బ్రహ్మ పదార్ధంగా మిగిలి పోయింది. వారికి కంప్యూటర్ గురించి అడిగి తెలుసుకోవాలన్నా కొంత మొహమాటం అడ్డు వస్తుంది. కొంత ధైర్యం చేసి అడిగినా వారిని ఏమీ తెలియని వింత జీవులుగా చూడటం మన వంతైంది. ఎందుకంటే మనకు అంత తీరిక ఉండదు కాబట్టి అని సరి పెట్టుకుంటాం. అసలు కారణం మనం ఆ కంప్యూటర్ గురించి మొదలు పెట్టి చెప్పాలంటే ఎక్కడ మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెట్టాలి అనే విషయాల గురించి కనీసం మనసు పెట్టి ఆలోచించక పోవటమే(ఇక్కడ కూడా సమయాభావమే మన సమాధానమవుతోంది) . అలాగని నేనేదో ఇక్కడ గొప్పగా ఆలోచిస్తాను అని చెప్పే ఉద్దేశ్యం కాదు. కానీ మన ముందు తరల వారికి కూడా కంప్యూటర్ గురించి కనీస పరిజ్ఞానం అందించాలనే నా ఈ చిరు ప్రయత్నం. ఇది ఏ కొద్ది మందికి ఉపయోగ పడినా నా ఈ శ్రమకు తగిన ఫలితం దక్కింది అనుకుంటాను. నా ఈ ప్రయత్నాన్ని మనస్పూర్తిగా ఆహ్వానించి ఆదరిస్తారని ఆశిస్తూ.... 
Related Posts Plugin for WordPress, Blogger...