30, జనవరి 2011, ఆదివారం

ప్రాధమిక పరిజ్ఞానం - 1

    ఈ రోజు మనం డెస్క్ టాప్ కంప్యూటర్ గురించి తెలుసుకుందాం. దాని పేరునిబట్టి అది బల్ల మీద పెట్టుకునే కంప్యూటర్ అని అర్ధం అవుతుంది. దీనిని మనం ఇళ్ళలోనూ ఇంటర్నెట్ సెంటర్ లలోను చూడవచ్చు. వివిధ రకాల డెస్క్ టాప్ కంప్యూటర్లను మనం ఇప్పుడు చూద్దాం.



సరిగ్గా గమనించినట్లైతే ఇందులో నాలుగు ముఖ్యమైన భాగాలు కనిపిస్తాయి. అవి ఏమిటో చూద్దాం. ఇందులో మొదటగా మన కంటికి కనిపించేది, కొంచెం తెలిసినట్లు అనిపించేది (టీవీ లాగా కనిపిస్తున్న)మోనిటర్ (Monitor). తెలుగులో అయితే తెర అనుకోవచ్చు. కంప్యూటర్ అనే ఈ బ్రహ్మ పదార్ధం లోపల ఏమి జరుగుతుందనేది చూడటానికి మాత్రమే అది ఉపయోగ పడుతుంది. 

మరి కంప్యూటర్ కి టివి కి తేడా చూపించగల ముఖ్యమైన భాగం ఎక్కడ ఉంది? మొదటి బొమ్మలో ఎడమ ప్రక్కన, రెండవ బొమ్మలో కుడి ప్రక్కన ఉన్న డబ్బా లాంటి ఆకారమే ఆ ముఖ్యమైన భాగం. మాయల ఫకీరు ప్రాణం చిలకలో ఉన్నట్లు ఈ కంప్యూటర్ ప్రాణం అంతా ఆ డబ్బాలోనే ఉంటుంది. దానినే CPU అంటారు. మరి ఆ మూడవ బొమ్మలో ఆ డబ్బా ఏమైనట్లు? అలాంటి డెస్క్ టాప్ లు ఈ మధ్యనే కొత్తగా తాయారు చేస్తున్నారు. వాటిలో ఆ CPU అనే భాగం తెర (Monitor) వెనుక ఉండి అన్ని పనులను నడిపిస్తుంది. 

  ఇక మిగిలినవి పురాతన టైపు రైటర్ మీద ఉన్నట్లుగా అక్షరాలు ఉన్న ఒక చెక్క బల్లలాంటి వస్తువు; దానిని కీ బోర్డు అంటారు. కంప్యూటర్ కి నోరు చెవులు లేవు కాబట్టి దానికి అర్ధం అయ్యే లాగా చెప్పాలి అంటే ఈ కీ బోర్డు అవసరం అవుతుంది. మనం ఎలాగైతే మూగ, చెవిటి వారికి అర్ధం అవటానికి కాగితం మీద వ్రాసి చూపిస్తామో అలాగే కంప్యూటర్ కి అర్ధం అయ్యేలాగా చెప్పాలి అంటే కీ బోర్డు మీద టైపు చేసి చూపించాలి. మరి మనం మూగ చెవిటి వారితో మాట్లాడాలి అంటే సైగలు చేస్తాం కదా అని అడగవచ్చు. కను సైగలను కూడా అర్ధం చేసుకుని అడిగిన పనులను చేసే కంపూటర్లు చూసే రోజు ఎంతో దూరంలో లేదు. ఈ లోపుగా ప్రస్తుతం ఉన్న కంపూటర్ల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

  ఇక చివరగా మిగిలిన అతి చిన్న అర చేతిలో ఇమిడి పోయే వస్తువు Mouse (మౌస్). Mouse అంటే చుంచు ఎలుక అని అర్ధం. దాని ఆకారాన్ని బట్టి దానికి ఆ పేరు వచ్చింది. మనం అక్కడ ఉంది, ఇక్కడ ఉంది అని సైగలతో చెప్పగల్గిన విషయాలను ఈ Mouse ని అటు ఇటు కదిలించటం ద్వారా చూపించ వచ్చన్నమాట. అంతే కాకుండా ఈ మౌస్ తో ఇంకా కొన్ని ముఖ్యమైన పనులు కూడా చెయ్యవచ్చు.  ఆ విషయాలను గురించి కూలంకషంగా మనం త్వరలోనే తెలుసుకుందాం.

ఇక పోతే అతి ముఖ్యమైన భాగం అనుకున్న CPU మూసిన గుప్పెట్లో ఏమి దాచుకుంది? మనం చెప్పిన పనులన్నీ, అంతే కాక మనకు కష్టం ఐన పనులను కూడా అంతా సులువుగా చేయగల శక్తితో మనుషులను కూడా శాసించ గల శక్తి దానిలో ఎక్కడ నిక్షిప్తమై ఉంది అనే విషయాలను మనం రేపు తెలుసుకుందాం. అంత వరకు శలవు తీసుకుంటూ...

7 కామెంట్‌లు:

venkata subbarao kavuri చెప్పారు...

మీ మొదటి పాఠంలోనే అర్ధమయింది సులభంగా చెప్పటం బాగా వచ్చని. నాలాంటి వారి కోసం మీ క్రుషి కొనసాగాలని హ్రుదయపూర్వకంగా కోరుతున్నాను.

Unknown చెప్పారు...

చాలా చక్కగా వివరించారండి. మీ బ్లాగును క్రమం తప్పకుండా అనుసరిద్దామని అనుకుంటున్నాను. మీరు చేసే ప్రతిపోస్టు తిన్నగా నా ఈమెయిల్‌కి వస్తే ఇంకా సంతోషిస్తాను. దయచేసి followers ని activate చేయగలరు.
ధన్యవాదములు

నా బ్లాగ్ నా ఇష్టం చెప్పారు...

మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి వెంకట సుబ్బారావు గారు. అలాగే హనుమంతరావు గారు, మీరు చెప్పినట్లుగా "అనుచరులు" (Followers) విభాగాన్ని బ్లాగ్ కు చేర్చటం జరిగింది. కానీ దురదృష్ట వశాత్తు అది సరిగా పనిచేయటం లేదు. మీ ఆదరాభిమానాలు ఇలాగే కొనసాగా గలవని ఆసిస్తూ ...

Unknown చెప్పారు...

హల్లో సంజీవ్ గారు, మీ బ్లాగ్ చాలా బాగుంది, మంచి విజ్ఞానదాయకంగా ఉంది.
నేను high through-put computer simulation చేయాల్సి ఉంది. కంప్యూటర్లకి ఎక్కడ చూసినా అన్ని రకాల USB attaching devices వస్తున్నాయ్. కానీ extra processors ఎక్కువ సంఖ్యలో attach చేసుకునే అవకాశం ఎక్కడా కనిపించటం లేదు. motherboardకి processor attaching slots ఎక్కువ ఉంటే అప్పుడు ఎక్కువ ప్రోసెసర్లని అటాచ్ చేసుకుని వాడుకోవచ్చని నా వెతుకులాటలో తెలిసింది. కానీ దానికి OS ఇంకా RAM సంభందిత విషయాలలో problems ఉన్నాయని అనిపిస్తుంది. నా imaginary point of view ఏంటంటే నేనో ఇరవై లేదా ముప్ఫై ప్రోసెసర్లని తీసుకుని వాటన్నిటినీ ఒక motherboardకో లేక వేరే విధంగానో cluster చేసి, ఆ deviceని laptopకి connect చేసుకుని సూపర్ కంప్యూటర్ స్థాయిలో వాడాలని అనుకుంటున్నాను. దీనికి ప్రస్తుతకాలంలో ఉన్న ఆటంకాలు ఎలాంటివి అంటారు, మరియు.. ఏం చెయ్యటం వలన వాటిని అధిగమించి సుసాధ్యం చెయ్యగలమని అంటారు. దీనిపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని సోదాహరణంగా వివరించగలరని ఆశిస్తూ

--
చంద్రమౌళి

నా బ్లాగ్ నా ఇష్టం చెప్పారు...

చంద్రమౌళి గారు మీ జిజ్ఞాస విషయ పరిజ్ఞానం నాకు నచ్చాయి. మీ ప్రశ్న మరియు మీ profile చూసినమీదట నాకు అర్ధమైనది ఏమంటే మీరు జీవ శాస్త్రం లో simulations చేద్దామనుకుంటున్నారు. దీనికి మీకు కావలసింది processor స్పీడ్ కన్నా Robustness, Number of cores, L3 Cache, RAM మరియు SPEED DATA STORAGE మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ simulation జరిగే వేగం కన్నా simulation జరిగే సమయం (కొన్ని రోజులు మొదలుకొని సంవత్సరాలు ) మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి మీరు గుర్తించాల్సిన మొదటి విషయం ఇది laptop కి అనుసంధానంగా నడిపించటం కుదరదు. మీకు i7 970 Desktop with Gigabyte USB 3 Motherboard & Solid State డ్రైవ్, 12GB RAM అయితే బాగుంటుంది. అయితే ఇది మీరు మీ సొంతానికి అయితే కొంత ఇబ్బంది కరమైన ధర అనగా ఒక లక్ష పైచిలుకు ధరలో ఉంది. మీకు కొంత తక్కువలో అంతకు దగ్గరి సామర్ధ్యం కలిగిన మరొకటి AMD PHENOM II X6 1090T Processor. మిగిలినవన్నీ పై మాదిరిగానే ఉండేటట్లు దీని ధర 60 వేలలో ఉంటుంది. అలా కాకుండా మీరు మీ సంస్థ తరఫున తెప్పించుకునే ఉద్దేశ్యంలో ఉంటే ఇది గమనించండి.


http://h10010.www1.hp.com/wwpc/us/en/sm/WF06b/15351-15351-3328412-241644-241475-4132832-4160149-4160152.html

ఇది మీకు సుమారు 3 లక్షలకు లభిస్తుంది. మీరు కోరినట్లుగానే ఇందులో రెండు 12CORE AMD Processors PARALLEL గా ఉంటాయి. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే నాకు mail చెయ్యండి sanjeevchs@gmail.com నాకు తెలిసి ఈ విషయం గురించి మరింత చర్చించటానికి ఇది సరైన ప్రదేశం కాదని నా అభిప్రాయం. అర్ధం చేసుకుంటారని ఆశిస్తూ...

అజ్ఞాత చెప్పారు...

great work !

Unknown చెప్పారు...

@Sanjeev:
చాలా చక్కని సమాధానాన్ని ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు, తదుపరి ప్రశ్నలేమైనా ఉంటే, మిమ్మల్ని కలిసి పశ్నిస్తాను. మరొకసారి ధన్యవాదాలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Related Posts Plugin for WordPress, Blogger...